సీనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో భారత్ కు మరో స్వర్ణం

వాస్తవం ప్రతినిధి: సీనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఈ టోర్నీ లో యువ షూటర్ మను బాకర్ సంచలనాలు సృష్టిస్తుంది. దీనితో తాజాగా మరో స్వర్ణ పతకం భారత్‌ ఖాతాలో చేరింది. సీనియర్‌ విభాగంలో తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న 16 ఏళ్ల మను.. సోమవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్‌లో రెండుసార్లు ప్రపంచకప్‌ స్వర్ణ పతక విజేత అలెగ్జాండ్రా జవాలాను వెనక్కినెట్టి పసిడి పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో భాగంగా ఈ రోజు 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ కోసం మను మరో భారత ఆటగాడు ఓం ప్రకాశ్‌ మితర్వాల్‌తో జట్టు కట్టింది. దీనితో 476.1 పాయింట్లతో మను జోడీ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. జర్మనీ (475.2), ఫ్రాన్స్‌ (415.1) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరో భారత జోడీ మహిమ తుర్హి అగర్వాల్‌-రిజ్వి జోడీ 372.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అలానే 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మెహులి ఘోష్‌-దీపక్‌ కుమార్‌ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది.