సద్దాం,ఆయన హయంలో పనిచేసిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న ఇరాక్ సర్కార్!

వాస్తవం ప్రతినిధి: ఇరాక్ మాజీ పాలకుడు సద్దాం హుస్సేన్, ఆయన హయాం లో పని చేసిన 4,200 మంది అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించుకుందట. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన జాబితాలో సద్దాంతోపాటు ఆయన కొడుకులు, మనుమలు, బంధువుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బాత్ పార్టీలో పనిచేసిన అధికారులు, వారి బంధువుల ఆస్తులపైనా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. మాజీ పాలకుడి అనుచరులు దూకుడుగా వెళ్లకుండా కళ్లెం వేసేందుకే ఇరాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. సద్దాం ప్రభుత్వంలో మంత్రులుగా, భద్రత సంస్థల అధినేతలుగా, బాత్ పార్టీ నాయకులుగా పనిచేసిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నట్లు ఇరాక్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపధ్యంలో ఒక జాబితాను కూడా తయారు చేసింది. అయితే వీరిలో కొందరు జైలులో మగ్గుతుండగా, మరికొందరిని ప్రభుత్వం ఉరితీసింది. ఇంకొందరు మరణించారు. 1988లో కుర్దులపై విష వాయువు ప్రయోగించాలని ఆదేశించిన సద్దాం హుస్సేన్ బంధువు అలీ హసన్ అల్ మజీద్ అలియాస్ కెమికల్ అలీ పేరు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నది. కెమికల్ అలీని 2010లో ప్రభుత్వం ఉరి తీసింది. సద్దాం హుస్సేన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగశాఖ మంత్రిగా పని చేసిన తారిఖ్ అజీజ్ ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. సద్దాం సన్నిహితుల్లో ఏకైక క్రైస్తవుడైన తారిఖ్ అజీజ్‌కు 2013లో మరణశిక్ష విధించారు. అయితే ఆయన మరణ శిక్ష అమలు కాకముందే 2015లో జైలులోనే మృతి చెందారు. తాజాగా ఇరాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతం జోర్డాన్‌లో నివసిస్తున్న తారిఖ్ అజీజ్ తనయుడు జియాద్ అజీజ్ ఖండించారు.