షోపియాన్‌ కాల్పుల కేసు దర్యాప్తు ను తాత్కాలికంగా నిలిపివేసిన సర్వోన్నత న్యాయస్థానం

వాస్తవం ప్రతినిధి: షోపియాన్‌ కాల్పుల కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసుకు సంబంధించిన ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌)లో మేజర్‌ ఆదిత్య కుమార్‌ పేరును నిందితుడిగా చేర్చలేదని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం వెల్లడించడంతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏప్రిల్‌ 24న ఈ కేసు తీర్పు వెలువరిస్తామని.. అప్పటివరకు దర్యాప్తును నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. షోపియాన్‌లోని గనోవ్‌పొరా గ్రామంలో ఈ ఏడాది జనవరి 27న సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో మేజర్‌ ఆదిత్య పేరుందని వార్తలు రావడంతో ఆయన తండ్రి లెఫ్టినెంట్‌ కల్నల్‌ కరమ్‌వీర్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరమ్‌వీర్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టగా.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య పేరును నిందితుడిగా చేర్చలేదని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం నివేదించింది. పోలీసు వాహనశ్రేణికి నేతృత్వం వహిస్తున్న సైన్యాధికారిగా మాత్రమే ఆయన్ను పేర్కొన్నట్లు తెలిపింది. దీనితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర స్పందిస్తూ.. ‘ఇది ఓ సైన్యాధికారికి సంబంధించిన కేసు. సాధారణ నేరస్తుడికి సంబంధించిందేమీ కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.