ముక్కోణపు సిరీస్ కోసం లంక ప్రత్యేక ఏర్పాట్లు!

వాస్తవం ప్రతినిధి: భారత్‌-బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం లంక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ ముక్కోణపు సిరీస్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభమవ్వబోయే ఈ సిరీస్ లో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వేసే టాస్‌ కోసం లంక బోర్డు ప్రత్యేకంగా బంగారు నాణేన్ని తయారు చేయించింది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వేసే టాస్‌ కోసం ప్రత్యేకంగా ఏడు నాణేలను తయారు చేయించాం. ఈ నాణెలకు బంగారం పూత వేయించాం’ అని ఆయన తెలిపారు. ‘టోర్నీలో భాగంగా మంగళవారం భారత్‌-శ్రీలంక మధ్య జరగనున్న మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కొనుగోలు చేసిన అభిమానులను సాయంత్రం 5.30గంటలకే మైదానానికి రండి. అప్పటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రి 7గంటలకు యథావిధిగా మ్యాచ్‌ ఆరంభం అవుతుంది’ అని సుమతిపాల వివరించారు.