నాగ అన్వేష్ తో మరో ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్

వాస్తవం సినిమా: కుమారి 21F’ సినిమాతో యూత్ హృదయాలను హెబ్బా పటేల్ కొల్లగొట్టేసింది. ఆ తరువాత ఆమె చేసిన ‘ఈడోరకం ఆడోరకం’.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలు ఆమెకి హిట్లు తెచ్చిపెట్టాయి. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయిగానీ .. అవి ఆమెకు సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో సహజంగానే అవకాశాలు మందగించాయి. తనకి అవకాశాలు రాకపోవడానికి .. బరువు పెరగడం కూడా ఒక కారణమని భావించిన ఈ సుందరి బాగానే కసరత్తు చేసి సన్నబడిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ సుందరి .. మరో ఛాన్స్ ను అందుకుంది. లండన్ గణేశ్ నిర్మించనున్న ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో నాగ అన్వేష్ హీరోగా చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘ఏంజెల్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయినా హెబ్బాకి కలిసొస్తుందో లేదో చూడాలి.