శ్రీకృష్ణుడి వేషధారణలో పార్లమెంటు ముందు టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన

వాస్తవం ప్రతినిధి: చిత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మరోసారి వినూత్న వేషధారణలో రాష్ట్ర హోదా కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలో పార్లమెంటు ముందు దర్శనమిచ్చారు. తలపై కిరీటం పెట్టుకున్న ఆయన చేతిలో పిల్లన గ్రోవి పట్టుకున్నారు. పార్లమెంటు రెండో దశ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.