రాజీనామా సమర్పించిన మాణిక్ సర్కార్

వాస్తవం ప్రతినిధి: త్రిపుర ముఖ్యమంత్రి పదవికి మాణిక్‌ సర్కార్‌ ఆదివారం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల త్రిపుర లో జరిగిన ఎన్నికల్లో మాణిక్ సర్కార్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తథాగత రారుకి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మాణిక్‌ సర్కార్‌ అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్‌ సర్కార్‌ ధనపూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బిజెపి రాష్ట్రానికి చెందిన ఇండిజినియర్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి)తో పొత్తు పెట్టుకొని విజయం సాదించడం తో రాష్ట్రంలో ఈ నెల 7న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ విషయాన్నీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి మంగళవారం ఇక్కడకు వస్తారని, ఆ సందర్భంగా పార్టీ శాసన సభ్యులతో సమావేశమై శాసన సభా పక్ష నేతను ఎన్నుకుంటారన్నారు. శాసన సభా పక్షనేతను ఎన్నుకున్న రెండు రోజుల తరువాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్‌ దేవ్‌కుమార్‌ను ఎన్నుకోనేవీలున్నట్లు తెలుస్తుంది.