ముంబాయి టీ-20 లీగ్ లో అమ్ముడు పోని పేసర్ శార్దూల్!

వాస్తవం ప్రతినిధి: ముంబాయి టీ-20 క్రికెట్ లీగ్ వేలం లో పేసర్ శార్దూల్ ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో రూ.2.60 కోట్ల ధర పలికిన ఈ ఆటగాడు ముంబయి టీ20 క్రికెట్‌ లీగ్‌ వేలంలో మాత్రం అమ్ముడు పోలేక పోయాడు. టీమిండియా తరఫున వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఈ మధ్యే జరిగిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో చాలా తెలివిగా బౌలింగ్‌ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. పొదుపుగా పరుగులిచ్చి అవసరమైన సమయాల్లో వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ వేలంలో రూ.11 కోట్లకు పైగా ధర దక్కించుకున్న ఎడమచేతి వాటం పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ సైతం అదే సిరీస్‌లో విఫలమైనా శార్దూల్‌ మాత్రం రాణించాడు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌కూ ఎంపికైన శార్దూల్‌ను ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అర్థం కాలేదు. ముంబయి రంజీ సారథి ఆదిత్య తారెను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. మరోవైపు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మను రూ.6 లక్షలకు, అండర్‌-19 ప్రపంచకప్‌ సారథి పృథ్వీషాను రూ.2.8 లక్షలకు ముంబయి నార్త్‌ కొనుగోలు చేసింది.