మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్

వాస్తవం ప్రతినిధి: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండియాను విడగొట్టింది మహ్మద్ అలీ జిన్నా కాదు.. నెహ్రూ, ఆజాద్, పటేలే అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు మొదట్లో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని జిన్నా అడగనే లేదని కానీ నెహ్రూ,ఆజాద్,పటేల్ లు ముస్లింలకు, సిక్కులకు మైనార్టీ హోదా ఇవ్వడానికి నిరాకరించడం వల్లే దేశం విడిపోయిందని ఆయన ఆరోపించారు. జిన్నా దేశాన్ని విడగొట్టాలని అనుకోలేదు కానీ ఆ కమిషనే దేశాన్ని విడగొట్టాలని నిర్ణయించింది. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తామని మాత్రం చెప్పింది అని అబ్దుల్లా అనడం గమనార్హం. ముస్లింలకు మైనార్టీ హోదా ఇస్తే ఓకే అని జిన్నా చెప్పారు. కానీ ఆ ముగ్గురూ అంగీకరించలేదు. దీంతో జిన్నా పాకిస్థాన్ డిమాండ్ చేశారు. లేదంటే అసలు దేశం విడిపోయేదే కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.