పేసర్ జోఫ్రా ఐపీఎల్ లో ఆడుతాడో లేదో అనుమానం!

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలంలో వెస్టిండీస్‌కు చెందిన పేసర్‌ జోఫ్రా ఆర్కర్‌ రికార్డు స్థాయిలో రూ.7.2కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు జోఫ్రా ఐపీఎల్‌లో ఆడేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అతడు అనారోగ్యం కారణంగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) నుంచి దూరమయ్యాడు. పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు, పొట్టలో ఓ సమస్య కారణంగా పీఎస్‌ఎల్‌ నుంచి దూరమౌతున్నట్లు క్వెట్టా గ్లాడియేటర్స్‌ ఫ్రాంఛైజీ ట్విటర్‌ ద్వారా తెలిపింది. దీంతో ఇప్పుడు అతను ఐపీఎల్‌లో ఆడే దానిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 7 నుంచి ఐపీఎల్‌-11వ సీజన్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో జోఫ్రా ఆడతాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.