జర్మనీ లో అనిశ్చితి కి తెర…నాలుగోసారి చాన్స్ లర్ గా మోర్కెల్

వాస్తవం ప్రతినిధి: జర్మనీలో ఏర్పడిన ఆరు నెలల రాజకీయ అనిశ్చితికి తెరపడింది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఓకే చెప్పడం తో అక్కడ నెలకొన్న అనిశ్చితి కి తెరపడి నట్లు అయ్యింది. ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో మెర్కెల్ వరుసగా నాలుగోసారి జర్మనీ చాన్సెలర్ కానున్నారు. మెర్కెల్.. 2005 నుంచి జర్మనీ చాన్సెలర్‌గా ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అన్న అంశంపై నిర్వహించిన పోస్టల్ బాలెట్‌లో 66.02 శాతం మంది మద్దతు తెలుపగా.. 33.92 శాతం మంది నో చెప్పారు. మార్చి నెల చివర్లోపు జర్మనీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గతేడాది సెప్టెంబర్ 24న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రెండు పార్టీలకు తగిన మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. గత నెలలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. దీనిపై నిర్వహించిన ఓటింగ్‌లో ఎస్‌పీడీకి చెందిన 4 లక్షల 60 వేల మంది సభ్యులు తమ నిర్ణయాన్ని చెప్పారు.