చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌ చేశారు. విభజన హామీలపై చర్చిద్దామని ఆయన ఫోన్‌లో సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న మరోసారి హామీలపై చర్చిద్దామని ఆయన చెప్పగా.. అందుకు సీఎం స్పందించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో బృందాన్ని చర్చలకు పంపుతానని అన్నట్టుగా సమాచారం. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన హామీలను అమలు చేయాలి. మా పోరాటం మీపై కాదు. ప్రజల డిమాండ్‌ కోసమే మేం పట్టుబడుతున్నాం. హామీల సాధన విషయంలో రాజీలేదు’ అని అమిత్‌షాతో చంద్రబాబు అన్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 5 నిమిషాల పాటు సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు నేతృత్వంలో జరిగిన చర్చల సారాంశం తాను విన్నానని సీఎం ఆయనకు స్పష్టంచేసినట్టు సమాచారం. ఇంకా కావాల్సిన లెక్కలను సుజనా చౌదరి బృందంతో పంపించనున్నట్టు సీఎం అమిత్‌షాతో అన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు చేయకపోవడంపై మిత్రపక్షమైన తెదేపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. హేతుబద్ధత లేకుండా విభజించిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి ఏమీ పట్టనట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై తెదేపా నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అలాగే, మలి దశ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను సైతం స్తంభింపజేయడంతో పాటు రాష్ట్ర హక్కులను సాధించే వరకూ కేంద్రంతో పోరాటానికి సన్నద్ధమవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసి పోరాటంలో భాగస్వాముల్ని చేయాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ రోజు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమిత్‌షా ఫోన్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.