ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ప్రకటన

వాస్తవం ప్రతినిధి: ప్రజలతో మాట్లాడుతూ సేదదీరుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు ఈ ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా కామ్రేడ్స్ అంతా చత్తీస్‌గడ్‌లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన వారు. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని దారాదత్తం చేసేందుకే నియంత కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారు. ఇకపై మేము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తాం. హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలపై, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం కోసం అబద్దాలు ప్రచారం చేశారు. ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనో ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కార్పోరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతాం.