మూడు రాష్ట్రాలలో బీజేపీ దే హవా అంటున్న నేతలు!

వాస్తవం ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాలలో ఈ రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల్లో బీజేపీనే గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ అధిక్యంలో ఉందని తెలిపిన ఆయన మూడు రాష్ట్రాలలో తమ పార్టీ నే అధికారం లోకి వస్తుంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం మేఘాలయలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ.. బీజేపీనే కచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడు రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని రామ్ మాధవ్ పేర్కొన్నారు. త్రిపురలో ఐపీఎఫ్‌టీ కూటమితో, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి బీజేపీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. మరోపక్క కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా త్రిపురలో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని అన్నారు. 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం ఈ సారి ఓటమి చవిచూడక తప్పదని ఆయన అన్నారు. 59 స్థానాలకు గానూ 36 నుంచి 42 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందన్నారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాల్లో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీ కొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆయన అన్నారు.