ముగిసిన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం….మీడియా తో మాట్లాడిన ఎంపీ గల్లా

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం లో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం అమరావతిలో ముగిసింది. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడవగా, ఇప్పటికి కేంద్రం నాలుగు బడ్జెట్ లను ప్రవేశ పెట్టింది. ఇప్పటికీ కూడా ఏపీ కి ఎలాంటి ప్యాకేజీ ని ప్రకటించక పోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలానే రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని మేం ఏం మాట్లాడామో అంతా చూశారు. ఆర్థికబిల్లు ముందే టేబుల్‌ చేశారు. మళ్లీ అది చర్చకు వచ్చినప్పుడు సవరణలు ఉంటే ఆ రోజే తెలుస్తుంది. దానిలో ఏపీకి ఫలానా హామీలు నెరవేర్చేందుకు కేటాయింపులు చేస్తామని చెబితే మంచిది. లేకపోతే దాన్నీ వ్యతిరేకిస్తాం. విడతలవారీగా మేం పోరాటం చేస్తాం. వైకాపా వాళ్లు ప్రత్యేక హోదా మాత్రమే అడుగుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీలో అన్నీ ఇస్తామన్నారు కాబట్టే మేం దానికి అంగీకరించాం. ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు కాబట్టే ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తున్నాం. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం అని ఆయన తెలిపారు.