ఆసియా రెజ్లింగ్ లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నవజ్యోత్!

వాస్తవం ప్రతినిధి: భారత రెజ్లర్‌ నవజ్యోత్‌ ‌కౌర్‌ ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. 65 కిలోల ప్రీస్టెయిల్‌ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో జపాన్‌కు చెందిన మిమా ఇమాయిని మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ పోటీ ప్రారంభం నుంచే ఏకపక్షంగా సాగడంతో కౌర్‌ విజయం అప్పటికే దాదాపు ఖాయం అయింది. ఈ క్రమంలో కౌర్‌ 9-1తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత సాక్షి మాలిక్‌ ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 62కిలోల ప్రీస్టెయిల్‌ విభాగంలో తలపడిన సాక్షి మాలిక్‌ కజకిస్థాన్‌కు చెందిన రెజ్లర్‌ ఆయాలిమ్‌ కస్సిమోవాపై 10-7తేడాతో పోరాడి ఓటమిపాలైంది. మొత్తంగా ఈ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆరు పతకాలు దక్కించుకుంది. ఇందులో ఒక స్వర్ణం, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.