అమెరికా అసత్య ప్రచారానికి పాల్పడుతుంది: ఉ.కొరియా

వాస్తవం ప్రతినిధి: తాము రసాయనిక ఆయుధాలను తయారు చేస్తున్నామంటూ అమెరికా అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఉ.కొరియా విమర్శించింది. సిరియా తూర్పు ప్రాంతంలోని ఒక పట్టణంలో ప్రజలు రసాయనిక దాడికి గురైన నేపథ్యంలో ఉ.కొరియా ఈ ఆయుధాలను తయారుచేస్తోందంటూ అమెరికా అసత్య ప్రచారం ప్రారంభించిందని ఉ.కొరియా విదేశాంగశాఖలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అమెరికన్‌ స్టడీస్‌లో ప్రెస్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. అమెరికా తన అధికార యంత్రాంగం సాయంతో ఈ ఆరోపణలను ఐరాస ఆంక్షల కమిటీ నివేదికగా బయటపెడుతోందని ఆయన విమర్శించారు. ఐరాస తన నివేదికను విడుదల చేసిన వెంటనే ఇటు ఉ.కొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ అమెరికా విదేశాంగశాఖ గగ్గోలు పెడుతోందని, అమెరికా కుట్రను దీనితో సులభంగా అర్థం చేసుకోవచ్చని ఈ ప్రకటనలో వివరించారు. ఇప్పుడు సిరియా-ఉ.కొరియా మధ్య సహకారం అంటూ రసాయనిక ఆయుధాల వినియోగంపై కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఉ.కొరియా రసాయనిక ఆయుధాలను తయారు చేసి విక్రయిస్తోందంటూ అనుచితమైన ఆంక్షలతో సముద్ర మార్గాలను దిగ్బంధించిన అమెరికా ఇప్పుడు సిరియాలో తన సైనిక జోక్యాన్ని సమర్థించుకునేందుకు తమపై అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.