అధ్యక్షుడు తుపాకులను నియంత్రించాలనుకోవడం లేదు: ఎన్ఆర్ఎ చీఫ్

వాస్తవం ప్రతినిధి: అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తుపాకులను నియంత్రించాలనుకోవడం లేదని నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌(ఎన్‌ఆర్‌ఎ) చీఫ్‌ లాబీయిస్ట్‌ చిరిస్‌ కాక్స్‌ తెలిపారు. ఇటీవల ఫ్లోరిడా లో జరిగిన కాల్పుల నేపధ్యంలో తుపాకులు కొనుగోలు చేసేవారికి కొన్ని నిబంధనలు విధించాలని, తుపాకీ సంస్కృతిని నిషేధించడానికి తాను అనుకూలమని రిపబ్లికన్ల సమావేశంలో ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే అధ్యక్షుడు తుపాకులను నియంత్రించాలని అనుకోవడం లేదంటూ ఈ ప్రకటన వెలువడింది. ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌లను తాను కలుసుకున్నానని, వారు ‘తుపాకీని నియంత్రించాలనుకోవడం లేదు.’ అని చిరిస్‌ గురువారం రాత్రి ట్వీట్‌ చేశారు. అనంతరం ట్రంప్‌ కూడా ఆ సమావేశాన్ని ధృవీకరిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే ఓవల్‌ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఎతో సమావేశం చాలా బాగా జరిగిందని మాత్రమే తెలిపారు తప్ప తన వైఖరి మారిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అయితే తుపాకుల విషయంలో ట్రంప్‌ వైఖరి ఇప్పుడు మారడం పట్ల ఆయన మిత్రులు, ప్రత్యర్థులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.