రాజీనామాలతో ఒరిగేదేమీ లేదు:జేసీ

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు పెద్దమనిషి తరహాలో హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారని, అది కూడా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని అనంతపురం తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో గురువారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో తెదేపా ఎంపీలు భేటీఅయి విభజన హామీలపై చర్చించారు. ఈ సమావేశం వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకు ఎంపీలు అమరావతికి వచ్చారు. చంద్రబాబు నివాసం వెలుపల జేసీ దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామా చేసినా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిక్కుకున్నారని, దాన్నుంచీ ఆయన బయట పడలేక పోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏపనైనా జరుగుతుందని అభిప్రాయపడ్డ ఆయన, రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుకు పోరాటం చేస్తామని తెలిపారు.