మహిళల ముక్కోణపు టోర్నీ షెడ్యుల్ లో మార్పులు

వాస్తవం ప్రతినిధి: భారత్‌ – ఇంగ్లాండ్‌ – ఆస్ట్రేలియా జట్లమధ్య ఈ నెలలో జరగనున్న ముక్కోణపు టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తుంది. మిథాలీ రాజ్‌ సేన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 3 వరకు భారత్‌ – ఇంగ్లాండ్‌ – ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరగాల్సి ఉంది. ఐతే ఈ నెల 31తో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే స్టార్‌ స్పోర్ట్స్‌తో బీసీసీఐ ఒప్పందం ముగియనుంది. దీంతో ఈ ముక్కోణపు టోర్నీని కాస్త ముందుకు జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సిరీస్‌ కంటే ముందు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ముక్కోణపు సిరీస్‌ అనంతరం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య సిరీస్‌ జరగనుంది. ఇప్పుడు ఏ సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తారో తెలియాలంటే మాత్రం వేచి ఉండాల్సిందే. ఫిబ్రవరిలో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. దీంతో పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళల మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న యోచనలో ఉంది బీసీసీఐ. అందుకే ఈ మార్పులు. 2018 ఏప్రిల్‌ 1 నుంచి ఐదేళ్లకు అంటే 2023 మార్చి 31 వరకు ప్రసార హక్కుల కోసం ఇప్పటికే బీసీసీఐ టెండర్లు పిలిచింది.