పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేసిన జేఎఫ్‌సీ

వాస్తవం ప్రతినిధి: సంయుక్త నిజనిర్ధరణ కమిటీ (జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ) తన నివేదికను ఈ రోజు పవన్ కల్యాణ్‌కు అందజేసినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై నివేదిక అందించేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చొరవతో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటైన విషయం తెలిసిందే. కేంద్రంనుంచి రావాల్సిన సాయంపై రాష్ట్రప్రభుత్వం ఏమేం కోరిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీకి పంపింది. వాటిని పరిశీలించిన కమిటీ.. రాష్ట్రానికి చేసిన సాయంపై భాజపా, కేంద్ర ప్రతినిధులు వివిధసందర్భాల్లో వేర్వేరుగా జారీ చేసిన పత్రాల్లోని వివరాలను సరిచూశారు. ఇరు ప్రభుత్వాల లెక్కలను పోల్చి విశ్లేషించిన కమిటీ వాటిలోని వాస్తవాంశాలను నివేదికలో వెల్లడించినట్లు నిర్ణయించింది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేదని జేఎఫ్‌సీ రిపోర్టులో పొందుపరిచినట్టు సమాచారం. ఈ రోజు హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ నివేదికపై సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ అధికారి తోట చంద్రశేఖర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజలకు ఎలా వివరించాలనే విషయంపై చర్చలు జరిపారు.