సచిన్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన మయాంక్

వాస్తవం ప్రతినిధి: విజయ్‌ హజారె ట్రోఫీలో విజేతగా నిలిచిన కర్ణాటక జట్టులో సభ్యుడు మయాంక్‌ అగర్వాల్‌. ఈ సీజన్‌లో 2141 పరుగులు చేసిన మయాంక్‌.. విజయ్‌ హజారె టోర్నీలోనే 723 పరుగులు సాధించడం విశేషం. అయితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ మయాంక్‌ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తాజాగా ఈ యువ క్రికెటర్‌ సచిన్‌ రికార్డును కూడా అధిగమించినట్లు తెలుస్తుంది. లిస్ట్‌-ఏ క్రికెట్లో ఒక టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇప్పటి వరకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సచిన్‌ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని మయాంక్‌ అగర్వాల్‌ కైవసం చేసుకున్నాడు. 2003 ప్రపంచకప్‌ టోర్నీలో సచిన్‌ 673 పరుగులు సాధించగా,ఇప్పుడు మయాంక్‌ విజయ్‌ హజారె ట్రోఫీలో 723 పరుగులతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.