శ్రీదేవి అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో బోనీ ఉద్వేగ‌భ‌రిత ప్ర‌క‌ట‌న!

వాస్తవం ప్రతినిధి: గత నాలుగురోజుల‌పాటు శ్రీదేవి వార్త‌ల‌తోనే మీడియా నిండిపోయిన సంగతి తెలిసిందే. అతిలోక‌సుంద‌రికి ఘ‌నంగా అంతిమ‌నివాళి సమ‌ర్పించిన‌ త‌ర్వాత మీడియా మ‌ళ్లీ సాధార‌ణ వార్త‌లు మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో శ్రీదేవి అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో బోనీ ఉద్వేగ‌భ‌రిత ప్ర‌క‌ట‌న చేశారు. స్నేహితురాలు, భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన వ్య‌క్తిని కోల్పోవ‌డం మాటల్లో చెప్ప‌లేనంత న‌ష్ట‌మ‌ని బోనీ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. త‌న బిడ్డ‌లు అర్జున్, అన్షులా ఇద్ద‌రూ జాన్వి, ఖుషికి ఎంతో మ‌నోధైర్యాన్ని ఇచ్చార‌ని, అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, భ‌రించ‌లేని ఈ న‌ష్టాన్ని ఎదుర్కోవ‌డానికి ఒక కుటుంబంగా తాము క‌లిసి ప్ర‌య‌త్నించామ‌ని బోనీ చెప్పారు. ఈ ప్ర‌పంచానికి ఆమె ఒక చాందిని… శ్రీదేవి… నాకు మాత్రం ఆమె నా ప్రేమ‌మూర్తి, స్నేహితురాలు, మా అమ్మాయిల‌కు త‌ల్లి. నా జీవిత భాగ‌స్వామి. మా ఇద్ద‌రు అమ్మాయిల‌కు ఆమే స‌ర్వ‌స్వం. ఆమే వారి జీవితం. మా జీవితాన్ని న‌డిపిన ఇరుసు. నా ప్రియ‌మైన శ్రీమ‌తికి, ఖుషి, జాన్వి మాతృమూర్తికి మేము వీడ్కోలు ప‌లికిన ఈ స‌మ‌యంలో నాదొక హృద‌య‌పూర్వ‌క విజ్ఞ‌ప్తి. మేము ఏకాంతంగా దుఃఖించాల్సిన మా అవ‌స‌రాన్ని గౌర‌వించండి. ఈ స‌మ‌యంలో నా ఆందోళ‌న అంతా ఒక‌టే. నా కుమార్తెలను ర‌క్షించుకోవ‌డం, స్త్రీ లేకుండానే ముందుకు వెళ్లే మార్గం చూసుకోవ‌డం. ఆమె మా జీవితం, మా బ‌లం, మేము స‌దా న‌వ్వుతూ ఉండ‌డానికి ఆమే కార‌ణం. మేము ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాం. నా ప్రియ‌త‌మా నీ ఆత్మ‌కు శాంతి క‌లుగుగాక‌. మా జీవితాలు మాత్రం మునుప‌టిలా ఎప్ప‌టికీ ఉండ‌బోవు అని బోనీక‌పూర్ ఆవేద‌నాభ‌రిత ప్ర‌క‌ట‌న చేశారు.