నోబెల్ కి నామినేట్ అయిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: నోబెల్‌ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ అయ్యారనే వార్తలు హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరికి తొలుస్తున్న ప్రశ్నకు నార్వేజియన్‌ నోబెల్ కమిటీ సమాధానం ఇచ్చింది. ట్రంప్‌కు సంబంధించి మోసపూరిత నామినేషన్‌ వచ్చినట్లు ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రంప్‌కు సంబంధించి మేం అందుకున్న నామినేషన్‌ మోసపూరితంగా భావిస్తున్నాం అని నోబెల్ ఇనిస్టిట్యూట్‌ డైరక్టర్‌ ఓల్వా జోల్‌స్టడ్‌ మీడియాకు వెల్లడించారు. అయితే ఇతర వివరాలు పోలీసుల విచారణలో తేలుతాయని ప్రకటించారు. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతికి సంబంధించిన నామినేషన్లు జనవరి 31 లోగా ముగుస్తాయి. వీటిని పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వం, నోబెల్ గ్రహీతలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రతిపాదించవచ్చు. నామినేట్‌ అయిన వారి పేర్లను 50 సంవత్సరాల వరకు రహస్యంగా ఉంచుతారు. అయినప్పటకి నామినేట్ అయినవారు వారు బయటకు చెప్పుకోవడానికి అనుమతిస్తారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ట్రంప్‌ పేరు నామినేషన్లలో ఉందని ఆసంస్థ తెలిపింది. పేరు బయటకు చెప్పడం ఇష్టపడని వ్యక్తి ద్వారా ట్రంప్‌ నామినేట్‌ అయ్యాడు. 2018 శాంతి బహుమతి కోసం 329 నామినేషన్లు వచ్చాయని నోబెల్‌ సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించి అవార్డు గెలుచుకున్న వారి పేర్లను అక్టోబర్‌ మొదటి వారంలో వెల్లడిస్తారు.