గ్రూప్-2పై లాయర్ల కమిటీ

వాస్తవం ప్రతినిధి: టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో వైట్నర్, బబ్లింగ్ వినియోగంపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ఆ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన 5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తామని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇందుకోసం ముగ్గురు సీనియర్ లాయర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ వచ్చేనెల 19కి వాయిదా వేశారు. ఓఎంఆర్ షీట్లలో తప్పులున్నా, కొట్టివేతలున్నా, వైట్నర్ వాడినా, కిందివైపు పేర్లు రాసినా.. అలాంటివారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన చరణ్‌దాస్ గోస్వామి..మరో 20 మంది, రామచంద్రారెడ్డి.. మరో 14 మంది పలు వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇదే సమయంలో వైట్నర్ వాడిన అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారి కోసం పరీక్షలపై స్టే ఇస్తే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నష్టపోతారంటూ కూడా రిట్లు దాఖలయ్యాయి. వీటిని బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపి న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేసి అగ్రస్థానంలో ఉన్న అయిదు వేల మంది ఓఎంఆర్ షీట్లను పరిశీలించాలని ఆదేశించింది.
సీనియర్ లాయర్లు నిరంజన్‌రెడ్డి, రఘునందన్‌రావు, రఘురామ్ కమిటీలో ఉంటారని, ఈ కమిటీ శని, ఆదివారాల్లో అయిదు వేల ఓఎంఆర్ సీట్లను పరిశీలించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. కమిటీ టాప్‌లో ఉన్న అయిదు వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలించి.. వాటిలో నిబంధన మేరకు ఎన్ని ఉన్నాయో, సర్వీస్ కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినవి ఎన్ని ఉన్నాయో తేల్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వీస్ కమిషన్ రికార్డులను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి పూర్తి నివేదికను అందజేయాలని కమిటీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 19వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు.