వింటర్ ఒలింపిక్స్ లో జకోవిచ్!

వాస్తవం ప్రతినిధి: దక్షిణ కొరియా లో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో జకోవిచ్‌! టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు శీతాకాల ఒలింపిక్స్‌కు ఏంటి సంబంధం? అని అనుకుంటున్నారా. అదేమీ లేదండీ అక్కడ ఆడేది జకోవిచ్‌ కాదు గానీ  దాదాపు అతని పోలికలతోనే ఉన్న పియరీ వాల్టీర్‌. తాజాగా వింటర్‌ ఒలింపిక్స్‌లో ఈ ఫ్రాన్స్‌ అథ్లెట్‌ స్నోబోర్డ్‌ క్రాస్‌లో పసిడి పతకం గెలుచుకున్నాడు. జకోవిచ్‌ రూపంతో పాటు అతనిలాగే పొడువుగా ఉండే వాల్టీర్‌కు నొవాక్‌ అంటే చాలా ఇష్టం. అతణ్ని ఎప్పటి నుంచో కలవాలని కూడా అనుకుంటున్నాడు. ఈ విషయాన్నే అతను వింటర్‌ ఒలింపిక్స్‌లో చెప్పాడు. ‘‘జకో ఆడుతుంటే అతని హావభావాలు, మాటతీరు అచ్చంగా నాలాగే అనిపిస్తాయి. నన్ను నేనే చూసుకున్నట్లు ఉంటుంది’’ అని వాల్టీర్‌ చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన జకో… ‘‘రొలాండ్‌ గారోస్‌లో తప్పకుండా కలుద్దాం వాల్టీర్‌.. స్వర్ణం గెలిచినందుకు అభినందనలు’’ అని ట్వీట్‌ చేశాడు. గత ఒలింపిక్స్‌లోనూ వాల్టీర్‌ స్వర్ణం గెలిచాడు. మే 27న ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుంది.