రాష్ట్ర విభజన హామీలపై చర్చకు అఖిలపక్షం: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం పనులను పరిశీలించించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై చర్చకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలను సమావేశపరిచి విభజన హామీలపై చర్చిస్తామని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలుకావడంలేదని, సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదో ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం వ్యవహరించాలని సూచించారు. పోలవరం పూర్తికాకుండా వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. టీడీపీ దూరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంపై అవిశ్వాసమంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీ, పార్లమెంట్‌ చట్టాలు తెలుసుకొని జగన్ మాట్లాడాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ పనిలేదు…
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ పనిలేదని సిఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కానందు వల్లనే రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.