మెక్సికో దక్షిణ ప్రాంతంలో కూలిన సైనిక హెలికాప్టర్….13 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: మెక్సికో దక్షిణ ప్రాంతంలో ఒక సైనిక హెలీకాప్టర్‌ కూలింది. అయితే ఈ ఘటనలో 13 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇటీవల మెక్సికో దక్షిణ ప్రాంతంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలకు సాయం చేసేందుకు సైనిక సిబ్బందితో పాటు ఆ దేశ హోం మంత్రిని కూడా తీసుకెళ్తున్న ఒక హెలీకాప్టర్‌ తీర ప్రాంతంలో వున్న పినోటెపా నేషనల్‌ పట్టణంలో లాండింగ్‌కు కొద్ది సేపటి ముందు ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు ఆక్సాకా స్టేట్‌ అధికారులు చెప్పారు. అయితే ఇందులో ప్రయాణిస్తున్న మెక్సికో హోంమంత్రి అల్ఫాన్సో నవరెట్‌, ఆక్సాకా గవర్నర్‌ అలెజాండ్రో మురాట్‌లో ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు వివరించారు. అయితే ప్రమాద ఘటనా స్థలంలోనే 12 మంది మరణించగా తీవ్రంగా గాయపడి ఒకరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తో మృతుల సంఖ్య 13కు చేరిందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.