మహిళలకు మరో స్వేచ్ఛను ఇవ్వనున్న సౌదీ సర్కార్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల సౌదీ లో మహిళలకు స్వేఛ్చ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో కారు డ్రైవింగ్ విషయంలో గానీ, స్టేడియం లకి వెళ్లడం వంటి విషయాల్లో అక్కడి మహిళలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో స్వేచ్ఛను ఇవ్వనుంది. సౌదీలో మహిళలు వ్యాపారాలు ప్రారంభించాలంటే ఇకపై భర్త లేదా కుటుంబంలోని మగవ్యక్తుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదట. ఇప్పుడు ఈ దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రయివేట్‌ రంగాన్ని శరవేగంతో అభివృద్ధి చేయాలని సౌదీ సర్కార్‌ భావిస్తున్నది. దానిలో భాగంగా గార్డియన్‌షిప్‌ విధానంలో సంస్కరణలు చేపట్టాలని కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఏ మహిళ అయినా వ్యాపారం చేయాలంటే కచ్చితంగా భర్త, తండ్రి లేదా సోదరుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో, ఉద్యోగాలు చేయాలన్నా లేదా వ్యాపారం ప్రారంభించాలన్నా మహిళలు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇక అక్కడ వ్యాపారం ప్రారంభించాలి అంటే ఇక మగ వారి అనుమతి తీసుకోనక్కర లేకుండా తగిన చర్యలు తీసుకుంటుంది.