ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత!

వాస్తవం సినిమా: ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని తన స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 61 ఏళ్ళు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. అయినప్పటికీ ఆయన తన అనారోగ్యం గురించి బయటకు చెప్పుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఆత్మాభిమానం చంపులేక ఎవరినీ చేయి చాచి సాయం అడగలేదు. అయితే.. మీడియాలో వచ్చిన వార్తతో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయాన్ని అందించారు.హనుమంతరావు మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
విజయవాడలో 1956లో జన్మించిన గుండు హనుమంతరావు నాటకాల మీద ఉన్న ఇష్టంతో 18 ఏళ్ల వయసులో నాటక రంగంలోకి ప్రవేశించారు. రావణబ్రహ్మ వేషంతో ఆయన పాపులర్ అయ్యారు. దాదాపు 400 సినిమాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన తొలిచిత్రం ‘అహ నా పెళ్లంట ‘చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న గుండు.. తర్వాతి కాలంలో చాలా సినిమాల్లో నటించారు. ‘ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు. ఇక బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.