గ్రీట్ చేయాలంటే పాదాలను తాకాల్సిన అవసరం లేదు: బీఎస్పీ అధినేత మాయావతి

వాస్తవం ప్రతినిధి:  గ్రీట్ చేయాలంటే పాదాలను తాకాల్సిన పని లేదని బీఎస్పీ అధినేత మాయావతి తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అభిమానులైనా, పార్టీ కార్యకర్తలైనా .. ఎవరూ తన పాదాలకు వందనం చేయకూడదని తాజా గా ఆమె సూచించారు. దళిత సంస్కర్తలు అంబేద్కర్, కాన్సీరామ్ అందించిన సూత్రాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాంటే.. పాదాలకు నమస్కరించడం వంటి చర్యలకు పాల్పడరాదు అంటూ మాయావతి తాజాగా తమ పార్టీ నేతలకు హితబోధ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ సి ఎం గా చేసిన ఆమె పాదాలను తాకేందుకు ఇప్పటికీ అనేక మంది తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ నేపధ్యంలో పబ్లిక్ ఫంక్షన్ ఎక్కడ జరిగినా కూడా ఆమె కాళ్లను మొక్కేందుకు జనం ఎగబడుతుంటారు. అయితే ఇలాంటి గౌరవ వందనాలను తిరస్కరించాలని ఆమె తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు బీఎస్పీ ఎంపీ మున్కడ్ అలీ తెలిపారు.