గుజరాత్ లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని

వాస్తవం ప్రతినిధి: వారంరోజుల పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కుటుంబం తో సహా భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తొలుత తాజ్ ని సందర్శించిన వారు సోమవారం గుజరాత్ లో పర్యటించారు. కుటుంబసమేతంగా ఈ ఉదయం అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రూడోకు గుజరాత్‌ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా.. ట్రూడో గుజరాత్‌లో పర్యటిస్తుండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ఆయన వెంట లేకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.  గతంలో షింజో అబే, జిన్‌పింగ్‌, బెంజమిన్‌ నెతన్యాహు లాంటి నేతలు గుజరాత్‌లో పర్యటించినప్పుడు వారి వెంట ప్రధాని మోదీ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రూడో వెంట లేకపోవడంపై అనేక వూహాగానాలు వెలువడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మోదీ ఇలా చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా మీడియా ఈ విషయంపై భారత్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. దీంతో ఈ వార్తలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అన్ని సార్లు ప్రధాని మోదీ వెళ్లలేరు అని సమాధానమిచ్చారు. అయితే ఈ శుక్రవారం ప్రధాని మోదీ.. ట్రూడోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది.