గత రాత్రి వైభవంగా జరిగిన ఆమ్రపాలి వివాహం

వాస్తవం ప్రతినిధి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, జమ్మూకు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు జమ్మూ కాశ్మీర్ లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సంప్రదాయ కశ్మీరీ దుస్తుల్లో ఆమ్రపాలి మెరిసిపోయారు.ఎరుపురంగు గాగ్రాకు, అదే కలర్లో, బంగారు రంగు బార్డర్ ఉన్న చోళీని తలపై నుంచి కిందవరకూ కప్పుకుని, రెండు చేతులకూ మణికట్టు వరకూ మ్యాచింగ్ గాజులు, నుదుట పెద్ద పాపిట బిళ్లను ధరించారు. ఇక వరుడు సమీర్, లైట్ క్రీమ్ కలర్ సూట్ లో మెరిసిపోయారు.

వీరి వివాహానికి వరంగల్ నుంచి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. తన నివాసమైన కేసీ రెసిడెన్సీ నుంచి సమీర్ శర్మ బంధు మిత్రులు, స్నేహితులతో కలసి బరాత్ గా కల్యాణ మండపానికి చేరుకున్నారు.ఈ నెల 21 వరకు కలెక్టర్‌ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనూ విందు కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన దంపతులు టర్కీలో పర్యటించనున్నారు.