గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు – దేశ రాజకీయాల మీద ప్రభావము

గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి, ప్రధాని మోదీ గారికి ముందుగా శుభాభివందనములు. అలాగే గట్టి పోటీ ఇచ్చి గుజరాత్ లో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన కాంగ్రెస్, దాని నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి కూడా మా అభినందనలు. అందరూ ఊహించిన విధంగానే, ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీ.జే.పి విజయం సాధించింది. అలానే అనేక కులసమీకరణాల లెక్కలతో ఎంత తీవ్రంగా ప్రయత్నంచినా 22 సం!! తర్వాత ఈసారి అయినా గుజరాత్ లో పాగా వేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరలేదు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు సమీప భవిష్యత్తులో దేశరాజకీయాల మీద, అలానే 2019 లోక్ సభ ఎన్నికల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.
బీ.జే.పి వైపు నుండి ఆలోచిస్తే ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో అత్యంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదే ఊపుతో 2018 ప్రధమార్థంలో జరగబోయే కర్నాటక, మిజోరాం, మేఘాలయా రాష్ట్రాల ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఉపకరిస్తుంది. కర్నాటక, దక్షిణ భారతదేశ ముఖద్వారం లాంటి రాష్ట్రంలో పాగా వేయడానికి ఉత్సాహంతో ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ విముక్త భారతావనికి చేరువ కావడానికి ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఈ విజయం ఉపకరిస్తుంది. అమిత్ షా వంటి అత్యంత సమర్థుడైన పూర్తి కాల అధ్యక్షుడి క్రింద నిరంతర ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నది. కార్పొరేట్ తరహా వ్యవహార శైలి, పనితీరుతో శ్రీ అమిత్ షా బీ.జే.పి కార్యకర్తలను, మంత్రులను, పార్టీ యంత్రాంగాన్ని అజమాయిషీ చేస్తూ దేశంలో జరిగే వివిధ రకాల ఎన్నికలకు ఎప్పుడూ సన్నద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ తో సహా దేశంలోని మిగతా రాజకీయ పక్షాలకు, బీ.జే.పి కీ ఉన్న తేడా ఇదే. మిగతా రాజకీయ పక్షాలకు పార్టీ అధినాయకుడు, ఒక్కడే నియంతలా ఉండడం, అన్నీ బాధ్యతలు ఒక్కడే చూడాల్సిరావడం, సరైన పార్టీ యంత్రాంగం లేకపోవడం. బీ.జే.పి విషయంలో ఆర్.యస్.యస్ లాంటి అత్యంత క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆధ్వర్యంలో, దాని సహకారంతో బీ.జే.పి అన్నీ దశలలో అత్యంత ప్రభావవంతమైన నాయకత్వం ఎదుగుతుండటం కలిసి వస్తున్నది. శ్రీ అమిత్ షా పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య చక్కటి సమన్వయం కుదర్చడం వలన ప్రధాని మోదీజీ తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు వీలుకలుగుతున్నది. వీరిరువురి చక్కటి సమన్వయం వల్ల, సమీప భవిష్యత్తులో వీరిని ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదేమో అన్న సందేహం వస్తున్నది. గడిచిన మూడు సం!! లలో ప్రధాని మోదీ గారు దేశంలో ఎక్కువ ఆర్థిక సంస్కరణల మీద, పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలను నెలకొల్పడంలోనూ ఎక్కువ శ్రద్ధ కనపరిచారు. ఆ దశలో భారత్ లో తయారీ, నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలలో గణనీయమైన ప్రగతి సాధించారు. పెద్దనోట్ల రద్దు, జీ.యస్.టీ వంటి పెద్ద ఆర్థిక సంస్కరణలను చేపట్టారు. జీ.యస్.టీ మంచి ఆర్థిక సంస్కరణ అయినప్పటికీ, ప్రారంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొని చిన్న వ్యాపారులకు ఇబ్బంది కల్గించిన మాట వాస్తవం. అలానే పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేశంలోని చిరు, పెద్ద వ్యాపారులు, ప్రజానీకం భవిష్యత్తుమీద ఆశతో ప్రధానికి అండగా నిలిచారు.
భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికలలో కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. బీ.జే.పి సాధించిన సీట్ల పరంగా చూస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు ప్రజలు సంపూర్ణ అంగీకారం తెలియచేయడంలేదని, అన్నీ సామాజిక వర్గాలు బీ.జే.పి పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపించుట లేదు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధాని పదవి చేపట్టిన తర్వాత అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, గుజరాత్ రాష్ట్ర బీ.జే.పి లో ఆ స్థాయి నాయకత్వం లేకపోవడం వలన, పాలన గాడి తప్పినది. సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర బీ.జే.పి నాయకత్వం చొరవ చూపడంలో విఫలమౌతున్నది.
ఎన్నికల ఫలితాలను గమనిస్తే పట్టణాలలో బి.జె.పీ తన పట్టు నిలుపుకొన్నది. కానీ గ్రామీణ గుజరాత్ లో బి.జె.పీ బలం బాగా కోసుకుపోయినది. ఇది ఒక విధంగా రాబోవు ఎన్నికల కొరకు, భారతీయ జనతా పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది. ఇదే ఫలితాలు 2019 లోకసభ ఎన్నికలలో పునరావృతం అయితే దాదాపు 56 సీట్లు బి.జె.పీ కి తగ్గటం ఖాయం. అప్పుడు అది భాగస్వామ్య పక్షాలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వుంటుంది. విశ్లేషకుల అభిప్రాయం అయితే ప్రధాని ఇక తన సంస్కరణల జోరు తగ్గిస్తారు అని. పాలనకు సంబందించిన సంస్కరణలు తప్ప వేరే వాటి జోలికి 2019 ఎన్నికలు అయ్యే వరకు వెళ్ళక పోవచ్చును అని. మిగిలిన 15 నెలల కాలంలో ప్రధాని తన దృష్టి సంక్షేమ పధకాల వైపు మరలిస్తారు అని. 2019 ఎన్నికలకంటే ముందే జరగబోవు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక విధంగా చిన్నపాటి సార్వత్రిక ఎన్నికలను తలపించ బోతున్నాయి. వీటిలో పార్టీని విజయ తీరాలకు చేర్చాలంటే ప్రధాని రైతుల కొరకు ఏదోఒకటి చేయాల్సి వుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గత 40 ఏళ్ళుగా ప్రభుత్వాలు రైతులకు పెద్దగా ఒరగ బెట్టినది యేమీ లేదు.

గుజరాత్ ఎలక్షన్లని పరిశీలిస్తే ముఖ్యంగా పాటిదార్లు అందరూ కాంగ్రెస్ కు ఓట్లు వేసినట్లు కనిపిస్తున్నది. పాటిదార్ల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం ద్వారా వారి సీట్లు పొంది అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. కాని ఆచరణలో, ఇది సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని గ్రహించిన బీ.జే.పి ఈ సమస్య మీద వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా మిగతా ఓ.బీ.సి కులాల ఓట్లు పొందగలిగింది. పాటీదార్లు ఎప్పుడైతే కాంగ్రెస్ వైపు మరలారో, అదే సమయంలో సాంప్రదాయబద్దంగా కొన్ని ఏళ్ళ నుంచి కంగ్రెస్ కు మద్దతు పలుకుతున్న ఓ.బీ.సి మిగతా షెడ్యూలు తెగల వర్గాలు బీ.జే.పి కి మద్దతు పలకడం ద్వారా బీ.జే.పి కి అధికారాన్ని కట్టబెట్టారు. పాటీదార్లకు రిజర్వేషన్స్ కల్పించాలంటే తమ రిజర్వేషన్స్ ఎక్కడ లాక్కొని ఇస్తారో అన్నది ఓ.బి.సీల భయము.
కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించినా, సామాజిక కుల సమీకరణాలతో కూటములు ఏర్పాటు చేసినా విజయాన్ని అందుకోలేక పోయినారు, బీ.జే.పి అబివృద్ధి మంత్రానికి ధీటుగా జవాబు చెప్పగల అంశం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేకపోయింది. ఒక ప్రక్క బీ.జే.పి ని మతతత్వ, కులతత్వ పార్టీ అని విమర్శిస్తూనే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కుల సమీకరణాలకు, పొత్తులకు తెరలేపడం సామాన్య పౌరులకు రుచించలేదు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నైతికతను దెబ్బతీసింది. అలానే రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన కూడా ఏమాత్రం ఫలితాలను ఇవ్వకపోగా, సోమనాద్ దేవాలయంలో హిందూయేతర రిజిష్టరులో సంతకం పెట్టడం, వివాదాస్పదం అయినది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వ్యూహాలను దెబ్బతీసింది. ఓటర్లలో పార్టీ పట్ల నమ్మకం సడలడానికి కారణం అయింది. చివరి దశ ప్రచారంలో అభివృద్ధి నినాదాలు వెనుకబడి, కుల మత అంశాలు ప్రధాన పాత్ర వహించాయి. అదనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వివిధ దశలలో చేసిన వివిధ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అదనపు తలనొప్పులు తెచ్చిపెట్టాయి (దీని గూర్చి మా పత్రికలో అభిప్రాయాలు శీర్షికలో 11.12.2017 లో ఒక వ్యాసం కూడా ప్రచురించడం జరిగింది) అదేవిధంగా బాబర్ అజామీ అనే కాంగ్రెస్ నాయకుడు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతినడంలో తమవంతు పాత్రను పోషించాయి. అలానే పార్టీ నుండి సస్పెండ్ అయిన నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఇంట్లో పాకిస్థాన్ కు చెందిన రాయబారులు, నాయకులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నాయకులు సమావేశమవడం కూడా వివాదాస్పదం అయింది. దొరికిన ఏ అవకాశాన్ని వదలని ప్రధాని మోదీ, ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకొన్నారు. పాకిస్తాన్ దౌత్యవేత్తలతో సమావేశం కావడంలో యెలాంటి తప్పులు లేకున్నా, సమావేశం అయిన సమయం మాత్రం సరి అయినది కాదని మా అభిప్రాయం. అదీ పార్టీ నుండి బయటకి గెంటివేయబడిన వివాదాస్పద నేత ఇంట్లో సమావేశం అవటం భేదాబిప్రాయలకు తావిస్తున్నది.
చివరగా ప్రదాన పార్టీలు రెండూ తమ ప్రత్యర్ధులు సాధించిన ఫలితాలను తక్కువ చేసే పనిలో తలమునకలు అయివున్నాయి. వాటి వాస్తవ బలాలను సమీక్షించుకొనే బదులు వాస్తవాలను దాచే పనిలో మునిగి పోయాయి. వివిధ కుల నాయకుల సహకారం లేకుండా కాంగ్రెస్ పార్టీ బలమైన రాష్ట్ర స్థాయి నాయకులు లేకుండా 80 సీట్లు గెలుచుకోగలదా అనేది ప్రశ్నార్ధకం. ప్రధాన పార్టీలు రెండూ గుజరాత్ కి సంభందించినంత వరకు పటిష్టమైన ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేసుకోవలసి వుంటుంది. అలానే పార్టీని పటిష్టపరచడంలో రాహూల్ గాంధీ చాలా శ్రమించవలసి వుంటుంది. బలమైన అమీత్ షా, మోడీ ద్వయాన్నీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులను సమన్వయ పరచడంలో ఆయన ఎంతవరకు నెగ్గుకు రాగలదన్నదే పెద్ద ప్రశ్న. ప్రజలకు సంభందించినంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకొనడం, బి.జె.పీ కి పనితీరు మెరుగు పరచుకొనుటకు, సమీక్షించుకొనుటకు అవకాశం ఇవ్వటం సంతోషకరమైన విషయం. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు ప్రదాన పార్టీలకు రెండింటికి ఒక గుణపాఠం నేర్పాయి.

…………………పులికొల్లు .గీతా రాణి